ప్రయాణించే సమయములో టైఫాయిడ్ వచ్చే అవకాశాలను తగ్గించుటకు చిట్కాలు

2023లో 5 లక్షల కేసులు నమోదు కావడముతో, భారతదేశములో టైఫాయిడ్ ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా నిలిచింది. ఈరోజు, చాలామంది భారతీయులు ఇదివరకటి కంటే ఎక్కువగా అంతర్జాతీయంగా (మరియు దేశీయంగా కూడా) ప్రయాణిస్తుండగా, టైఫాయిడ్ కు వ్యతిరేకంగా జాగ్రత్తలు తీసుకోవడం కీలకం అవుతుంది. ముందుగా మరియు మీ తరువాతి యాత్రలో కొన్ని నివారణాత్మక చర్యలు తీసుకోవడం ద్వారా మీరు సురక్షితంగా ఉండవచ్చు.
టైఫాయిడ్ అంటే ఏమిటి?
టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా టైఫి ద్వారా వచ్చే ఒక బ్యాక్టీరియల్ సంక్రమణ. ఇది కలుషిత ఆహారము మరియు నీటి ద్వారా వ్యాపిస్తుంది మరియు జ్వరము, తలనొప్పి మరియు తీవ్రమైన కడుపు నొప్పి దీని లక్షణాలు. భారతదేశము వంటి దక్షిణ ఆసియా దేశాలలో టైఫాయిడ్ ప్రధాన ప్రజారోగ్య ఆందోళనగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఎందుకంటే సరిగ్గాలేని పారిశుధ్య పరిస్థితులు దాని వ్యాప్తికి దోహదపడతాయి.
ప్రయాణించే సమయములో టైఫాయిడ్ రాకుండా ఎలా సురక్షితంగా ఉండాలి?
టైఫాయిడ్ రాకుండా సురక్షితంగా ఉండేందుకు, మీరు ఈ క్రింది సులభమైన చర్యలు చేపట్టవచ్చు:
- WASH నియమావళి (నీరు, పారిశుద్ధ్యం, చేతుల పరిశుభ్రత)ని అనుసరించండి.
- మీ ఆహార ఎంపికలతో జాగ్రత్తగా ఉండండి.
- ప్రయాణానికి ముందు టైఫాయిడ్ టీకా తీసుకోండి
1. WASH నియమావళి
ప్రయాణించే సమయములో, మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచేందుకు మీరు ఖచ్ఛితమైన పరిశుభ్రత ప్రమాణాలను అనుసరించడం తప్పనిసరి. మీ చేతులను తరచూ సబ్బు మరియు నీటితో కడుక్కోండి, ముఖ్యంగా శౌచాలయం ఉపయోగించిన తరువాత మరియు ఆహారం తినే ముందు. ఒకవేళ సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే, మీరు 60% ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించవచ్చు.
2. సురక్షితమైన ఆహార ఎంపికలు
- సలాడ్స్ తో సహా, పచ్చి లేదా వండని ఆహారం తినకండి.
- బఫే ఎంపికల కంటే వేడిగా ఉన్న మరియు తాజాగ వండిన భోజనాన్నే ఎంచుకోండి.
- వడగట్టని నీరు త్రాగకండి మరియు నీటి మూలం గురించి మీకు ఖచ్ఛితంగా తెలియకపోతే మరిగించిన లేదా సీసా నీటిని త్రాగండి.
- శుద్ధిచేసిన నీటితో చేశారని మీకు ఖచ్ఛితంగా తెలిస్తే తప్ప, పానీయాలలో ఐస్ క్యూబ్స్ వేసుకోకండి. బదులుగా వేడి పానీయాలు, పరిశుభ్రంగా చేసిన పళ్ళరసాలు లేదా ప్యాకేజ్డ్ పానీయాలు త్రాగండి.
- పాశ్చరైజ్ చేయని పాలు, పాల ఉత్పత్తులు లేదా సగం ఉడికించిన గ్రుడ్లకు దూరంగా ఉండండి.
- చెక్కు తీయదగిన పండ్లు, అరటిపండ్లు లేదా బత్తాయి పండ్ల వంటివి లేదా బాగా కడగగలిగే పండ్లను తినండి.
3. టైఫాయిడ్ కు వ్యతిరేకంగా టీకా వేయించుకోండి
టైఫాయిడ్ పట్ల ఉన్న ఉత్తమ రక్షణ టీకాకరణ. దీర్ఘ-కాలిక రక్షణ కొరకు టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్స్ (టిసివిలు) లను డబ్ల్యూహెచ్ఓ సిఫారసు చేస్తుంది. మీ ప్రయాణం తేదీకి కనీసం రెండు నెలల ముందు టీకా వేయించుకోవటానికి మీరు మీ వైద్యుడిని సంప్రదించండి.
టీకాకరణ నిజంగా అవసరమా?
చాలా జాగ్రత్తగా ఉండే ప్రయాణీకులకు కూడా టైఫాయిడ్ వచ్చే ప్రమాదము ఉంది. టీకాకరణ సంక్రమణ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా, దాని వ్యాప్తి వేగాన్ని పరిమితం చేయడంలో కూడా సహాయపడుతుంది. సహజమైన సంక్రమణ దీర్ఘకాలిక నిరోధకత అందించదు కాబట్టి, టైఫాయిడ్ నుండి కోలుకున్న వారికి కూడా టైఫాయిండ్ వచ్చే అవకాశం ఉంటుంది మరియు వారికి కూడా టీకాకరణ అవసరం.
ముగింపు
టైఫాయిడ్ ఒక నివారణాత్మక వ్యాధి, కాని ఇది ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశములో లక్షలకొద్దీ ప్రజలను ప్రభావితం చేస్తోంది. మీరు దేశములో ప్రయాణిస్తున్నా లేదా విదేశాలలో ప్రయాణిస్తున్నా, సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మంచి పరిశుభ్రత అలవాట్లు అనుసరించడం, మంచి ఆహార ఎంపికలు చేయడం మరియు టీకా వేయించుకోవడం అనేవి మిమ్మల్ని మీరు మరియు మీ చుట్టూ ఉన్న వారిని రక్షించుకొనుటకు ఉన్న సులభమైన, ప్రభావవంతమైన మార్గాలు. టైఫాయిడ్ మీ ప్రయాణానికి ఆటంకం కలిగించకుండా చూసుకోండి. సమస్యలు లేని ప్రయాణం కోసం ముందుగా ప్రణాళిక చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి మరియు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి.
మూలాలు
డిస్క్లెయిమర్: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ద్వారా ఒక ప్రజా అవగాహన కార్యక్రమము. ఈ సమాచారము సాధారణ అవగాహన కొరకు మాత్రమే మరియు ఎలాంటి వైద్య సలహా అందించదు. చూపించబడిన వైద్యులు, వైద్య సదుపాయాలు మరియు గ్రాఫిక్స్ కేవలం ఉదాహరణ కొరకు చూపించబడినవే. మీ వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నల ఉంటే, మీ వైద్యుడి నుండి సలహా తీసుకోండి.