మీకు వీధి ఆహారం నుండి టైఫాయిడ్ వస్తుందా?

టైఫాయిడ్ జ్వరము కలుషిత ఆహారము మరియు నీరు తీసుకోవడం వలన సంక్రమించే ఒక బ్యాక్టీరియల్ సంక్రమణ. సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వలన టైఫాయిడ్ వ్యాపిస్తుంది, మానవ పేగులలో జీవిస్తుంది మరియు సంక్రమణ సోకిన వ్యక్తి (లేదా కొన్నిసార్లు కోలుకున్న వ్యక్తులు కూడా) మలము లేదా మూత్రము ద్వారా బ్యాక్టీరియాను ‘వదిలినప్పుడు’ వ్యాపించవచ్చు. అక్కడి నుండి, అది కలుషితమైన ఆహారము లేదా నీటి ద్వారా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది.
టైఫాయిడ్ ఎలా వ్యాపిస్తుంది?
సాధారణంగా, సంక్రమణ సోకిన వ్యక్తి సరైన వ్యక్తిగత పరిశుభ్రత లేకుండా ఆహారము మరియు పానీయాలు తయారు చేసినప్పుడు, సాల్మొనెల్లా టైఫి బ్యాక్టీరియాతో అవి కలుషితం అవుతాయి. ఉదాహరణకు, సంక్రమణ సోకిన వ్యక్తి శౌచాలయాన్ని ఉపయోగించి, తన చేతులు కడుక్కోకుండా, ఇతరుల కొరకు భోజనం లేదా పానీయం తయారు చేయవచ్చు. ఇలా మీ ఆహారము నుండి మీకు బ్యాక్టీరియా సోకవచ్చు. మరికొన్ని సందర్భాలలో, త్రాగునీళ్ళలో మురుగునీరు కలిసినప్పుడు కూడా నీరు కలుషితం కావచ్చు.
వీధి ఆహారం తినడం వలన ప్రమాదాలు
ఇంట్లో తయారు చేయబడిన ఆహారము సాధారణంగా వినియోగానికి సురక్షితమైనదిగా, వీధి ఆహారం ప్రమాదాలు కలిగించే అవకాశం ఉన్నదిగా పరిగణించబడుతుంది. ఇది అన్నివేళల జరగనప్పటికీ (టైఫాయిడ్ ఇంట్లో కూడా వ్యాపించవచ్చు), ఇంటివద్ద-చేసిన భోజనం సాధారణంగా ఖచ్ఛితమైన పరిశుభ్రత సూత్రాలు అనుసరించి చేయబడుతుంది, కాని వీధి ఆహారం కొన్నిసార్లు సరిగ్గాలేని పరిశుభ్రత ప్రమాణాలలో తయారుచేయబడవచ్చు.
వీధి ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తరచూ, వీధి విక్రేతలు ఉపయోగించే నీరు వడగట్టనిది లేదా మరిగించనిది. ఒకవేళ వాళ్ళు సురక్షితమైన-త్రాగునీటిని ఉపయోగించినప్పటికీ, ఆహారం తయారు చేసే వ్యక్తులు వంటచేసే ముందు చేతులు కడుక్కొని ఉండకపోవచ్చు. కొన్నిసార్లు, వంటపాత్రలు కడగటానికి ఉపయోగించిన నీరు కూడా అసురక్షితమైనది కావచ్చు. మరికొన్ని సందర్బాలలో, వీధి ఆహారం విక్రేతలు చాలా తక్కువ పారిశుధ్యము ఉన్న ప్రదేశాలలో పనిచేస్తారు, ఉదా- పాదచారుల మార్గంపై లేదా రోడ్డుపక్కన.
చాలామంది వీధి ఆహార విక్రేతలు తమ ఆహారాన్ని ప్రదర్శనకు పెడతారు. ఆహారం ఆకలి పుట్టించేదిగా కనిపించాలని సాధారణంగా ఇలా చేస్తారు, కాని ఆహారాన్ని బహిరంగంగా అలా ఉంచడం వలన, టైఫాయిడ్ వాహకాలు అయిన ఈగలు వాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నన్ను నేను సురక్షితంగా ఉంచుకొనుటకు నేను ఏం చేయాలి?
అదృష్టవశాత్తు, వీధి ఆహారం తినేటప్పుడు టైఫాయిడ్ ప్రమాదాన్ని నివారించుటకు అనుసరించవలసిన కొన్ని సురక్షితమైన తినే అలవాట్లు ఉన్నాయి.
1. చల్లని లేదా గోరువెచ్చగా ఉన్న ఆహారాన్ని తినకండి
మీరు తినే ఆహారం సరిగ్గా వండినదని మరియు మీకు వేడిగా వడ్డించబడిందని నిర్ధారించుకోండి. ఆహారం ముందుగానే వండి ఉంచబడి, మీకు వడ్డించే ముందు తిరిగి వేడిచేయబడే ప్రదేశాలకు వెళ్ళకండి.
2. పచ్చి పళ్ళు మరియు కూరగాయలు తినకండి
సరిగ్గా కడగకుండా కోసి అమ్మబడే పళ్ళు మరియు కూరగాయలకు దూరంగా ఉండండి. వీటిని తయారుచేసే సమయములో అవి కలుషితం కావచ్చు. ఒకవేళ మీరు పళ్ళు తినాలని అనుకుంటే, తినే ముందు చెక్కు తీయగలిగే అరటిపళ్ళు మరియు బత్తాయి పండ్ల వంటివాటిని తినవచ్చు.
3. సరిగ్గా ఉడికించని ఆహారాన్ని తినకండి
పచ్చి లేదా సరిగ్గా వండని గ్రుడ్లు, మాంసము మరియు చేపలతో కాలుష్య ప్రమాదము ఉంటుంది. మీకు వడ్డించే ప్రతి వంటకము తాజాగా తయారుచేయబడినదని మరియు బాగా ఉడికించబడిందని నిర్ధారించుకోండి.
4. వడగట్టని నీటిని త్రాగకండి
టైఫాయిడ్ అనేది కలుషితమైన నీటి ద్వారా వ్యాపించే ఒక అనారోగ్యము. శుభ్రమైన నీటిని త్రాగడం తప్పనిసరి. ఒకవేళ మీకు నీటి నాణ్యత గురించి ఖచ్ఛితంగా తెలియకపోతే, మరిగించిన లేదా సీసా నీటిని మాత్రమే త్రాగండి. మీరు తినే ఆహారము కూడా వడగట్టిన, మరిగించిన లేదా మినరల్ నీటితో తయారుచేయబడిందని నిర్ధారించుకోండి.
5. ఐస్ ఉన్న పానీయాలు త్రాగకండి
ఐస్ తయారు చేయటానికి ఉపయోగించే నీటి గురించి మీకు ఖచ్ఛితంగా తెలియకపోతే, అటువంటి ఐస్ ఉన్న పానీయాలను త్రాగకండి. టీ లేదా కాఫీ వంటి వేడి పానీయాలు ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయము.
6. పాశ్చరైజ్ చేయబడని పాలు మరియు పాల ఉత్పత్తలను తీసుకోకండి
పాశ్చరైజ్ చేయబడని పాల నుండి తయారు చేయబడిన మిఠాయిలు, పానీయాలు మరియు వంటకాలకు దూరంగా ఉండండి. సాధ్యపడితే, ఉపయోగించబడే పాలు ఒక ప్యాకెట్ (అది పాశ్చరైజ్ చేయబడినది అని తెలిపేది) నుండి ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించుకోండి.
7. టీకా వేయించుకోండి
టైఫాయిడ్ జ్వరము సాధారణంగా వచ్చే ప్రదేశాలలో, సంక్రమణ నివారించుటకు టైఫాయిడ్ కొరకు టీకా వేయించుకోవడం ఒక మంచి విధానము.
ముగింపు
వీధి ఆహారం ఆశపుట్టించేదిగా ఉన్నప్పటికీ, దానితో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. టైఫాయిడ్ జ్వరము కలుషితమైన ఆహారము మరియు నీటి ద్వారా ప్రబలుతుంది కాబట్టి, మీరు ఏమి తింటున్నారు మరియు ఎక్కడ తింటున్నారు అనేదాని గురించి జాగ్రత్తగా ఉండాలి. చేతులు కడుక్కోవడం, తాజాగా వండిన ఆహారాన్ని తినడం మరియు వడగట్టిన నీటిని త్రాగడం వంటి ప్రాథమిక పరిశుభ్రత ఆచరణలను అనుసరించడం మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయి. సందేహము ఉంటే, ఇంట్లో వండిన భోజనం ఎంచుకోవడం లేదా సరైన పరిశుభ్రత ప్రమాణలు ఉన్న ప్రదేశాలలో తినడం, ప్రమాదాన్ని తగ్గించడములో సహాయపడతాయి. టీకా వేయించుకోవడం టైఫాయిడ్ ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుంది. కొద్దిపాటు జాగ్రత్త టైఫాయిడ్ మరియు ఇతర ఆహారము వలన వచ్చే వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడములో సహాయపడుతుంది.
మూలాలు
డిస్క్లెయిమర్: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ద్వారా ఒక ప్రజా అవగాహన కార్యక్రమము. ఈ సమాచారము సాధారణ అవగాహన కొరకు మాత్రమే మరియు ఎలాంటి వైద్య సలహా అందించదు. చూపించబడిన వైద్యులు, వైద్య సదుపాయాలు మరియు గ్రాఫిక్స్ కేవలం ఉదాహరణ కొరకు చూపించబడినవే. మీ వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నల ఉంటే, మీ వైద్యుడి నుండి సలహా తీసుకోండి.