టైఫాయిడ్ ఎలా వ్యాపిస్తుంది మరియు ప్రతి తల్లిదండ్రులకు ఏ విషయము గురించి అవగాహన ఉండాలి

టైఫాయిడ్ ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే ఒక తీవ్రమైన అనారోగ్యము, కాని సరైన పరిశుభ్రత అలవాట్లు లేకపోవడం మరియు కలుషితమైన ఆహారము మరియు నీటిని ఉపయోగించడం కారణంగా పిల్లలు ప్రభావితం అయ్యే అవకాశం ఎక్కువ. తల్లిదండ్రులుగా, ఇది ఎలా వ్యాపిస్తుంది, దీనిని ఎలా నివారించాలి, మరియు పిల్లలను దీని నుండి ఎలా రక్షించాలి వంటి విషయాలు అర్థంచేసుకోవడం మీకెంతో ముఖ్యం. ఈ వ్యాసములో, మనము టైఫాయిడ్ సంక్రమణ, దాని నివారణ మరియు నియంత్రణ గురించి చర్చించుకుందాం.
టైఫాయిడ్ ఎలా వ్యాప్తిస్తుంది?
టైఫాయిడ్ సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది నోటిద్వారా, సాధారణంగా మనం తీసుకునే కలుషిత ఆహారము లేదా నీటి ద్వారా, శరీరములోకి ప్రవేశిస్తుంది. శరీరములోకి ప్రవేశించిన తరువాత, సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ పేగుల వెంబడి ప్రయాణించి, రక్తనాళాల ద్వారా వ్యాపించి శరీరం మొత్తాన్ని ఆక్రమిస్తుంది మరియు జ్వరము మరియు ఇతర లక్షణాలు కలిగిస్తుంది.
మీ పిల్లలకు టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉన్న అతి సాధారణ మార్గాలలో కొన్ని:
- కలుషితమైన నీటిని త్రాగడం
- అపరిశుభ్రంగా ఉన్న వీధి ఆహారాన్ని తినడం, ముఖ్యంగా చల్లగా అందించబడేవి (కొంతసేపు ప్రదర్శించబడిన పళ్ళు, చాట్, మిఠాయిలు లేదా చిరుతిళ్ళు వంటివి)
- స్థానికంగా తయారుచేయబడిన మరియు వడగట్టని లేదా కలుషితమైన నీరు కలిగిన ఐస్ క్రీమ్ లేదా ఐస్ ‘గోలాస్’ తినడం
- వీధిలో అమ్మే విక్రేతల నుండి అసురక్షితమైన చెరకురసం లేదా ఇతర పళ్ళరసాలు త్రాగడం (ఐస్ తో కలిపి లేదా ఐస్ లేకుండా)
టైఫాయిడ్ లక్షణాలు ఏవి?
కొన్నిసార్లు, టైఫాయిడ్ నుండి కోలుకున్న తరువాత కూడా, కొంతమంది రోగులలో ఎలాంటి లక్షణాలు చూపకుండా బ్యాక్టీరియా వారి ఆంత్రములో ఉండవచ్చు. దీర్ఘకాలిక వ్యాధివాహకులు అని పిలువబడే వీరు, తెలియకుండానే కొన్ని సంవత్సరాల వరకు బ్యాక్టీరియాని వ్యాప్తి చేస్తూ, ఇతరులను సంక్రమించవచ్చు. వాళ్ళు సముదాయాలలో టైఫాయిడ్ ప్రబలే ప్రమాదాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు.
పిల్లలు ఒక వ్యాధివాహకుడి ద్వారా అపరిశుభ్రమైన పరిస్థితులలో తయారు చేయబడిన ఆహారం తిన్నప్పుడు లేదా పాఠశాలల వంటి ప్రదేశాలలో వారు ఒక దీర్ఘకాలిక వ్యాధివాహకుడిని పరోక్షంగా కలిసినప్పుడు ఈ అంటువ్యాధికి గురి కావచ్చు.
టైఫాయిడ్ లక్షణాలు ఏవి?
- కొన్ని వారాల వరకు ఉండే క్రమంగా పెరిగే జ్వరము
- బద్ధకం లేదా నీరసం
- వాంతులు, విరేచనాలు లేదా మలబద్ధకము
- దగ్గు
- అరుదుగా, ఛాతిపై పేలవమైన దద్దుర్లు కనిపించవచ్చు
ఒకవేళ మీ పిల్లలు ఈ లక్షణాలలో దేనినైనా కనబరిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. చికిత్స అందించకుండా వదిలేస్తే, టైఫాయిడ్ దీర్ఘ-కాలిక సమస్యలకు దారితీయవచ్చు.
టైఫాయిడ్ ఒక పిల్లవాని నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుందా?
చాలా సంక్రమణల మాదిరి కాకుండా, టైఫాయిడ్ నేరుగా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సంక్రమించదు. అయితే, అది పరోక్షంగా ప్రబలవచ్చు, ముఖ్యంగా పారిశుధ్యం సరిగ్గా లేని చోట. ఉదాహరణకు, సంక్రమణ సోకిన ఒక పిల్లవాడు శౌచాలయానికి వెళ్ళి, అతని/ఆమె చేతులు సరిగ్గా కడుక్కోకుండా వారి తోబుట్టువలతో కలవలిసినప్పుడు లేదా వారి చేతులను నోట్లో పెట్టుకుంటే లేదా చేతులు కడుక్కోకుండా ఆహారం తింటే, వారికి సంక్రమణ సోకే ప్రమాదం ఉండవచ్చు.
టైఫాయిడ్ ను ఎలా నివారించాలి?
మీ బిడ్డకు టైఫాయిడ్ రాకుండా నివారించటానికి, మీరు ఈ క్రింది నివారణాత్మక చర్యలు అనుసరించవచ్చు, అవి:
- చేతులను క్రమంతప్పకుండా కడుక్కోవడం, ముఖ్యంగా ఆహారాన్ని వండేటప్పుడు లేదా వడ్డించేటప్పుడు లేదా తినేటప్పుడు.
- శౌచాలయాన్ని ఉపయోగించిన తరువాత ఎప్పుడు చేతులు కడుక్కోవాలని వారికి నేర్పించండి.
- శుద్ధిచేయని నీటిని త్రాగవద్దని, కేవలం వడగట్టిన లేదా మరిగించిన నీటిని మాత్రమే త్రాగాలని వారికి నేర్పించండి.
- మీ పండ్లు మరియు కూరగాయలు బాగా కడగండి, అలాగే మీ భోజనాన్ని క్రమంగా వండండి.
- ఒకవేళ వాళ్ళు బయట తింటూ ఉంటే, పచ్చి ఆహారం తినకూడదు. బత్తాయి లేదా అరటిపండు వంటి చెక్కు తీయగలిగిన పళ్ళు లేదా తాజాగా వండగలిగిన మరియు వడ్డించగలిగిన ఆహారాన్ని మాత్రమే తినాలి.
- వ్యాధి నుండి రక్షించబడుటకు మంచి మార్గము టీకా వేయించుకోవడం, కాబట్టి వారికి టీకా వేయించడం మరవకండి.
టైఫాయిడ్ టీకా నన్ను మరియు నా కుటుంబాన్ని ఎలా రక్షిస్తుంది?
టైఫాయిడ్ నుండి రక్షించబడుటకు టీకాకరణ చాలా ప్రభావవంతమైన మార్గము. టైఫాయిడ్ నుండి కోలుకున్న రోగులు తిరిగి పునఃస్థితికి వచ్చే ప్రమాదం కూడా ఉంది. సహజమైన సంక్రమణ టైఫాయిడ్ నుండి దీర్ఘ-కాలిక మరియు తగినంత నిరోధకతను అందించదు. ఒకవేళ మీకు ఇదివరకే సంక్రమణ వచ్చినా కూడా, టైఫాయిడ్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకొనుటకు టీకాకరణ సిఫారసు చేయబడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధివాహకుల నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది మరియు సముదాయాలలో మహమ్మారి ప్రబల కుండా రక్షిస్తుంది.
టైఫాయిడ్ వచ్చిన పిల్లలకు కోలుకున్న 4 నుండి 6 వారాల తరువాత టీకా వేయించాలి.
ముగింపు
టైఫాయిడ్ ఒక తీవ్రమైన సమస్యే కాని, కలుషితమైన ఆహారము మరియు నీటి నుండి వ్యాపించే ఈ వ్యాధి నివారించదగినది. అది ఎలా వ్యాపిస్తుంది అనేది అర్థంచేసుకోవడం మరియు మంచి పరిశుభ్రతను అలవరచుకోవడం, సురక్షితమైన ఆహారాన్ని మరియు నీటిని తీసుకోవడం మరియు టీకా వేయించుకోవడం వంటి ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా, తల్లిదండ్రులు వారి పిల్లలకు సంక్రమణ వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చు. టైఫాయిడ్ దీర్ఘకాలిక సమస్యలు కలిగి ఉంటుంది మరియు దీర్ఘకాలిక వ్యాధివాహకులు తెలియకుండానే బ్యాక్టీరియాను వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి, జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. టైఫాయిడ్ నుండి మరియు అది తిరిగి రాకుండా రక్షించబడుటకు టీకాకరణ అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది, తద్వారా మీ ప్రియమైన వారికి ఆరోగ్యం మరియు సురక్షితమైన భవిష్యత్తును నిర్ధారిస్తుంది.
మూలాలు
డిస్క్లెయిమర్: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ద్వారా ఒక ప్రజా అవగాహన కార్యక్రమము. ఈ సమాచారము సాధారణ అవగాహన కొరకు మాత్రమే మరియు ఎలాంటి వైద్య సలహా అందించదు. చూపించబడిన వైద్యులు, వైద్య సదుపాయాలు మరియు గ్రాఫిక్స్ కేవలం ఉదాహరణ కొరకు చూపించబడినవే. మీ వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నల ఉంటే, మీ వైద్యుడి నుండి సలహా తీసుకోండి.