తరచుగా అడగబడే ప్రశ్నలు
లక్షణాలు
టైఫాయిడ్ జ్వరము యొక్క సాధారణ లక్షణాలు ఏవి?
ప్రతిరోజు ఉష్ణోగ్రత పెరుగుతూ స్థిరంగా ఉన్న జ్వరము, తలనొప్పి, తీవ్రమైన అలసట, కడుపు నొప్పి మరియు మలబద్ధము లేదా విరేచనాలు వంటివి టైఫాయిడ్ యొక్క అత్యంత సాధారణమైన లక్షణాలు.[1]
సంక్రమణ తరువాత ఎంత తొందరగా లక్షణాలు కనిపిస్తాయి?
సంక్రమణ సోకిన వ్యక్తిలో టైఫాయిడ్ లక్షణాలు కనిపించటానికి సుమారు 7 నుండి 14 రోజులు పడుతుంది. అయితే, కొన్ని కేసులలో, లక్షణాలు పెరగడానికి తొందరగా 3 రోజుల నుండి ఆలస్యంగా 2 నెలల సమయం పడుతుంది.[2]
టైఫాయిడ్ జ్వరము దీర్ఘ-కాలిక ఆరోగ్య సమస్యలు కలిగిస్తుందా?
చికిత్స అందించకపోతే, టైఫాయిడ్ జ్వరము పేగులలో రక్తస్రావము లేదా చిల్లులు పడడముతో సహా అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగించవచ్చు. తీవ్రమైన కేసులలో, ఇది మెదడు కలుపుకొని, ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేయవచ్చు.[3,4]
టైఫాయిడ్ జ్వరము మరియు ఆహార విషబాధ రెండు ఒకటేనా?
టైఫాయిడ్ జ్వరము సాల్మొనెల్లా టైఫి అనే ఒక రకం బ్యాక్టీరియా కారణంగా వస్తుంది, ఇది ఆహారము ద్వారా వ్యాప్తి చెందవచ్చు. అయితే, ఆహార విషబాధ వంటిది కాదు. టైఫాయిడ్ ఒక ప్రాణానికి ముప్పు కలిగించే అవకాశం ఉన్న వ్యాధి. దీనికి సరైన సమయములో మరియు అనుగుణమైన యాంటిమైక్రోబియల్స్ తో చికిత్స చేయాలి, WASH నియమావళి మరియు టైఫాయిడ్‌కు వ్యతిరేకంగా టీకా ద్వారా నివారించబడాలి, కాని ఆహార విషబాధ సాధారణంగా ఒక వారములో తగ్గిపోతుంది.[5,6]
ఒకవేళ టైఫాయిడ్‌కు చికిత్స అందించకపోతే ఏ విధమైన సమస్యలు ఉత్పన్నం అవుతాయి?
సరైన సమయములో జోక్యము మరియు సరైన చికిత్సతో, టైఫాయిడ్ జ్వరము ఒక వారములో మెరుగుపడవచ్చు. అయితే, ఒకవేళ చికిత్స అందించకపోతే, లక్షణాలు ఇంకా తీవ్రం అవుతాయి మరియు ఆసుపత్రిలో చేరిక అవసరం కావచ్చు. చికిత్స అందించబడని రోగులు పూర్తిగా కోలుకోవటానికి వారాలు లేదా నెలలు కూడా పట్టవచ్చు.[1]
టైఫాయిడ్ ఉందని అనుమానిస్తే, నేను వైద్యుడిని ఎప్పుడు కలవాలి?
మీకు టైఫాయిడ్ జ్వరము ఉండవచ్చు అని మీరు అనుకుంటే, వీలైనంత తొందరగా వైద్యుడిని సంప్రదించండి. ఒకవేళ లక్షణాలు స్థిరంగా లేదా తీవ్రంగా ఉంటే, ఆసుపత్రిలో చేరిక అవసరం కావచ్చు.[7,8]
నివారణ
నేను టైఫాయిడ్‌ను ఎలా నివారించగలను?
మీరు మీ చేతులను తరచుగా కడుక్కోవడం మరియు టీకాతో పాటు మంచి పరిశుభ్రతను పాటిస్తే టైఫాయిడ్ ను నివారించవచ్చు. మీకు ఏ టీకా ఉత్తమమైనది అని తెలుసుకోవటానికి వైద్యుడిని సంప్రదించండి.
టైఫాయిడ్ నివారించడములో చేతులు కడుక్కోవడం ఎందుకు ముఖ్యమైనది?
ఒకవేళ మీరు చేతులను సబ్బుతో సరిగ్గా కడుక్కోకపోతే, ముఖ్యంగా శౌచాలయం ఉపయోగించిన తరువాత లేదా భోజనం చేసే ముందు, టైఫాయిడ్ మనము తాకే వస్తువుల నుండి మన నోటికి లేదా ఇతర వ్యక్తులకు బ్యాక్టీరియా సులభంగా సంక్రమిస్తుంది.[9]
వడగట్టని నీటి నుండి నాకు టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉందా?
అవును. వడగట్టని లేదా సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా ద్వారా కలుషితమైన నీటిని త్రాగడం వలన టైఫాయిడ్ సంక్రమించే ప్రమాదం పెరుగుతుంది.[5]
టైఫాయిడ్ నివారించుటకు నేను ఇంటి వద్ద అనుసరించవలసిన పరిశుభ్రత ఆచరణలు ఏవి?
టైఫాయిడ్ ప్రమాదాన్ని తగ్గించుటకు ఇంటి వద్ద ఈ పరిశుభ్రత ఆచరణలను అనుసరించండి:
- మీ చేతులను వేడి, సబ్బు నీటితో తరచూ కడుక్కోండి.
- వడగట్టని/పరిశుద్ధం చేయబడని నీటిని త్రాగకండి.
- మీ ఆహారము బాగా ఉడికించబడిందని నిర్ధారించుకోండి.
- చెక్కు తీయలేని సరిగ్గా కడగని ముడి పళ్ళు మరియు కూరగాయలను తినకండి.
- టీకా వేయించుకొనుటకు మీ వైద్యుడిని సంప్రదించండి.[10]
సంక్రమణ సోకిన వ్యక్తిని అనుకోకుండా తాకినప్పుడు టైఫాయిడ్ వ్యాపిస్తుందా?
లేదు, సంక్రమణ సోకిన వ్యక్తిని నేరుగా లేదా అనుకోకుండా తాకినప్పుడు టైఫాయిడ్ జ్వరము వ్యాపించదు. కాని, వాళ్లు తాకినదానిని దేనినైనా మీరు తాకితే, ముఖ్యంగా వాళ్లు శౌచాలయముకు వెళ్ళిన తరువాత చేతులు కడుక్కోకపోతే, మీకు టైఫాయిడ్ సోకే ప్రమాదం ఉండవచ్చు.[11]
సరైన పారిశుధ్యం టైఫాయిడ్ సంక్రమణను తగ్గించుటలో ఎలా సహాయపడుతుంది?
టైఫాయిడ్ కలిగించే బ్యాక్టీరియా మానవ మలము మరియు మూత్రాల ద్వారా వ్యాపిస్తుంది. సరైన పారిశుధ్యము లేని ప్రదేశాలలో, సంక్రమణ సోకిన మానవ వ్యర్థాలు కొన్నిసార్లు నీటి సరఫరాను కలుషితం చేయవచ్చు. ఈ నీటిని త్రాగిన లేదా ఈ నీటితో కడిగిన ఆహారాన్ని తిన్నవారికి టైఫాయిడ్ రావచ్చు.[5]
టైఫాయిడ్ నివారించుటలో ఆహార భద్రత పాత్ర ఏమిటి?
సాల్మొనెల్లా టైఫి ఆహారము లేదా నీటి ద్వారా వ్యాపిస్తుంది, కాబట్టి, ఆహార భద్రతను పాటించడం చాలా ముఖ్యం. మీరు అనుసరించదగిన కొన్ని అంశాలు ఈ దిగువన ఇవ్వబడ్డాయి:[11]
- మీకు టైఫాయిడ్ జ్వరము ఉంటే, ఇతరుల కొరకు ఆహారాన్ని వండకండి.
- ఆహారాన్ని వండడము, వడ్డించడము లేదా తినడానికి ముందు చేతులను బాగా కడుక్కోండి.
- ఆహారాన్ని తయారు చేసే ముందు మరియు ఆ తరువాత అన్ని వంటచేసే ఉపరితలాలను మరియు వంట పాత్రలను బాగా శుభ్రం చేయండి.
- ప్రయాణము చేసే సమయములో, పరిశుభ్రతా ప్రమాణాల గురించి మీకు ఖచ్ఛితంగా తెలియకపోతే, ముఖ్యంగా ఆహారానికి సంబంధించి, అధిక ఉష్ణోగ్రతలలో తయారుచేయబడిన ఆహారాన్ని తినడం లేదా ప్యాకేజ్డ్ ఆహారాన్ని తినే ప్రయత్నం చేయండి.
- శుద్ధి చేయబడని లేదా ఐస్ క్యూబ్స్ తో తయారు చేయబడిన పానీయాలను త్రాగకండి.
- ఒకవేళ ఖచ్ఛితంగా తెలియకపోతే, బాగా మరిగించిన లేదా సీసా నీళ్ళను త్రాగడం మంచిది.
రోగనిర్ధారణ మరియు చికిత్స
టైఫాయిడ్ జ్వరము ఎలా నిర్ధారించబడుతుంది?
టైఫాయిడ్ జ్వరము మీ రక్తము, మలము, మూత్రము లేదా ఎముక మజ్జల నమూనాను పరీక్షించడం ద్వారా నిర్ధారించబడుతుంది.[12]
టైఫాయిడ్ కొరకు ఉన్న సాధారణ చికిత్సలు ఏవి?
మీ వైద్యుడి ద్వారా నిర్దేశించబడిన యాంటిబయాటిక్స్ చికిత్స టైఫాయిడ్ కొరకు ఉన్న అత్యంత సాధారణ చికిత్స. సరైన చికిత్సతో, లక్షణాలు కొన్ని రోజులలోనే మెరుగుపడవచ్చు. ఇంటి వద్ద, మీరు బాగా తిని విశ్రాంతి తీసుకోవాలి మరియు పుష్కలంగా ద్రవాలు త్రాగాలి.[13] ఈరోజే టీకా వేయించుకొని టైఫాయిడ్ జ్వరము వచ్చే అవకాశాలను తగ్గించుకోండి.
టైఫాయిడ్ నుండి కోలుకోవటానికి నాకు యాంటిబయాటిక్స్ అవసరమా?
అవును, టైఫాయిడ్ నుండి కోలుకోవటానికి యాంటిబయాటిక్స్ అవసరము. చాలామందికి 10 నుండి 14 రోజుల పూర్తి కోర్సు తీసుకోవలసి ఉంటుంది. యాంటిబయాటిక్స్ తీసుకున్న 6 నుండి 7 రోజులలోనే మీ లక్షణాలు మెరుగు అయినప్పటికీ, వైద్యుడు నిర్దేశించిన పూర్తి చికిత్సను పూర్తి చేయడం ముఖ్యం.[13]
టైఫాయిడ్ నుండి కోలుకోవటానికి ఎంత కాలం పడుతుంది?
టైఫాయిడ్ కొరకు మీరు చికిత్స ప్రారంభించిన తరువాత, కొన్ని రోజులలోనే మీకు ఉపశమనం లభిస్తుంది. జ్వరము నుండి పూర్తిగా కోలుకొనుటకు 10 రోజుల వరకు పట్టవచ్చు మరియు అలసట మరియు బలహీనతలు తగ్గడానికి మరింత సమయం పట్టవచ్చు. అయితే, మీకు సమస్యలు లేదా పునఃస్థితి ఉంటే కోలుకోవటానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.[11]
టైఫాయిడ్ కు ఇంటి వద్ద చికిత్స అందించవచ్చా లేక ఆసుపత్రిలో చేరిక అవసరమా?
ప్రారంభ దశలో నిర్ధారించబడితే, టైఫాయిడ్ జ్వరానికి ఇంటి వద్దనే యాంటిబయాటిక్స్ తో చికిత్స అందించవచ్చు. కాని లక్షణాలు తీవ్రం అయితే లేదా సమస్యలు ఉంటే, అప్పుడు మీకు ఆసుపత్రిలో చేరిక అవసరం కావచ్చు.[13]
టైఫాయిడ్ నుండి కోలుకోవటానికి నేను ఏమి తినాలి మరియు త్రాగాలి?
టైఫాయిడ్ జ్వరము నుండి కోలుకునే సమయములో, క్రమమైన భోజనం తినడం మరియు పుష్కలంగా ద్రవాలు త్రాగడం ముఖ్యం. 3 సార్లు భోజనం చేసే బదులు మీరు రోజంతా చిన్న చిన్న మోతాదులలో తినవచ్చు. తాజాగా వండిన మరియు వేడిగా వడ్డించబడిన ఆహారాన్ని తినండి. వండని లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఆహారాన్ని తీసుకోకండి.[10,13]
టీకాకరణ
అందుబాటులో ఉన్న వివిధ రకాల టైఫాయిడ్ టీకాలు ఏవి?
టైఫాయిడ్ జ్వరానికి రెండు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి:[14]
- టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ (టిసివి)
- వి పాలీశాకరైడ్ (వి-పిఎస్)
టైఫాయిడ్ టీకా రక్షణ ఎంతకాలం ఉంటుంది?
వేరువేరు టీకాలకు వేరువేరు రక్షణ సామర్థ్యాలు ఉంటాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారము, టిసివి అనే టీకా చిన్న పిల్లల కొరకు అత్యంత అనుకూలమైనది మరియు ఎక్కువ కాలం రక్షణ అందిస్తుంది కాబట్టి, టైఫాయిడ్ నివారించుటకు అన్ని వయసుల వారికి సూచించబడుతుంది.[14]
టైఫాయిడ్ టీకా గురించి ఇక్కడ మీరు మరింత తెలుసుకోవచ్చు.
టైఫాయిడ్ టీకా యొక్క దుష్ప్రభావాలు ఏమిటి?
టీకాతో ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేనప్పటికీ, కొంతమందికి జ్వరము, సూదిమందు చేసిన చోట నొప్పి మరియు వాపు కలగవచ్చు.[15]
టైఫాయిడ్ టీకా పిల్లలకు సురక్షితమైనదేనా?
టిసివి అనేది పిల్లల కొరకు అత్యంత సురక్షితమైన టీకాగా పరిగణించబడుతుంది, ఎందుకంటే దీనిని 6 నెలల వయసు ఉన్న పిల్లలకు కూడా ఇవ్వవచ్చు. వి-పిఎస్ కేవలం 2 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు ఇవ్వవచ్చు.[15]
టైఫాయిడ్ కొరకు నాకు టీకా ఎక్కడ లభిస్తుంది?
టైఫాయిడ్ కొరకు టీకా చేయించుకొనుటకు, ఈరోజే మీ వైద్యుడిని సంప్రదించండి.
ప్రయాణ జాగ్రత్తలు
టైఫాయిడ్-మహమ్మారి ఉన్న ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు నేను ఏ ఆహారాలు తీసుకోకూడదు?
ప్రయాణించే సమయములో, పచ్చి పళ్ళు మరియు కూరగాయలు, ముఖ్యంగా కడగడం లేదా చెక్కు తీయడం కుదరనివి తినకండి. అసురక్షితమైన సముద్ర ఆహారం, పచ్చి గ్రుడ్లు మరియు పాశ్ఛరైజ్ చేయని డైరీ ఉత్పత్తులు తినకండి. వడగట్టని నీటిని త్రాగకండి మరియు ఐస్ లేని పానీయాలను అడగండి.[10]
ప్రయాణములో నేను సురక్షితమైన త్రాగునీటిని ఎలా నిర్ధారించగలను?
ప్రయాణము చేసేటప్పుడు మరిగించిన నీటిని లేదా సీసా నీటిని లేదా మినరల్ వాటర్ ను త్రాగండి.[10]
ప్రయాణాలలో వీధి ఆహారం తినడం సురక్షితమేనా?
ప్రయాణాలలో వీధి ఆహారం తినకపోవడం మంచిది. అయితే, ఒకవేళ అవసరం అయితే, చల్లని లేదా పచ్చి ఎంపికలు కాకుండా తాజాగా వండిన, ఆవిరి గ్రక్కుతున్న వేడి ఆహారాన్నే తీసుకోండి.[10]
నా ప్రయాణములో నేను ఎలాంటి పరిశుభ్రత ఆచరణలను అనుసరించాలి?
తరచూ మీ చేతులను కడుక్కోండి. మీ వెంట సబ్బును తీసుకెళ్ళండి మరియు శౌచాలయం ఉపయోగించిన తరువాత మరియు తినే ముందు చేతులు కడుక్కోండి. ఒకవేళ మీ వద్ద సబ్బు లేకపోతే, ఆల్కహాల్-ఆధారిత శానిటైజర్ ఉపయోగించవచ్చు.[10]
ప్రయాణములో నాకు టైఫాయిడ్ లక్షణాలు కనిపిస్తే నేను ఏం చేయాలి?
ప్రయాణములో మీరు అనారోగ్యం పాలైతే మరియు టైఫాయిడ్ లక్షణాలు కనిపిస్తే, మీరు టీకా వేయించుకున్నప్పటికీ, వీలైనంత తొందరగా వైద్యుడిని సంప్రదించండి.[1]
నా ప్రయాణము తరువాత టైఫాయిడ్ ను తిరిగి ఇంటికి తీసుకొని రాకుండా నేను ఎలా నివారించాలి?
మీ ప్రయాణము తరువాత టైఫాయిడ్ ను తిరిగి ఇంటికి తీసుకొని రాకుండా నివారించుటకు, వ్యక్తిగత పరిశుభ్రత యొక్క మంచి ప్రమాణాలను నిలిపి ఉన్నారని నిర్ధారించుకోండి. మీ చేతులను తరచూ కడుక్కోండి, పచ్చి లేదా ఉడికించని ఆహారాన్ని తినకండి మరియు వడగట్టబడని నీటితో చేసిన పానీయాలు త్రాగకండి. పరిశుభ్రత మరియు పారిశుధ్యం సరిగ్గాలేని ప్రదేశానికి మీరు ప్రయాణిస్తూ ఉంటే, టీకా వేయించుకోవడం కూడా సిఫారసు చేయబడుతుంది.[13,10, 16]
వనరులు
- https://www.nhs.uk/conditions/typhoid-fever/symptoms/
- https://www.emro.who.int/health-topics/typhoid-fever/introduction.html
- https://www.nhs.uk/conditions/typhoid-fever/complications/
- https://www.mayoclinic.org/diseases-conditions/typhoid-fever/symptoms-causes/syc-20378661
- https://www.nhs.uk/conditions/typhoid-fever/causes/
- https://www.nhs.uk/conditions/food-poisoning/
- https://www.mayoclinic.org/diseases-conditions/typhoid-fever/symptoms-causes/syc-20378661#when-to-see-a-doctor
- https://www.nhs.uk/conditions/typhoid-fever/treatment/
- https://www.mayoclinic.org/diseases-conditions/typhoid-fever/symptoms-causes/syc-20378661#causes
- https://www.mayoclinic.org/diseases-conditions/typhoid-fever/symptoms-causes/syc-20378661#prevention
- https://my.clevelandclinic.org/health/diseases/17730-typhoid-fever
- https://www.mayoclinic.org/diseases-conditions/typhoid-fever/diagnosis-treatment/drc-20378665
- https://www.nhs.uk/conditions/typhoid-fever/treatment/
- https://www.who.int/teams/immunization-vaccines-and-biologicals/diseases/typhoid
- https://www.who.int/groups/global-advisory-committee-on-vaccine-safety/topics/typhoid-vaccines
- https://www.nhs.uk/conditions/typhoid-fever/vaccination/
డిస్‌క్లెయిమర్: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ద్వారా ఒక ప్రజా అవగాహన కార్యక్రమము. ఈ సమాచారము సాధారణ అవగాహన కొరకు మాత్రమే మరియు ఎలాంటి వైద్య సలహా అందించదు. చూపించబడిన వైద్యులు, వైద్య సదుపాయాలు మరియు గ్రాఫిక్స్ కేవలం ఉదాహరణ కొరకు చూపించబడినవే. మీ వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నల ఉంటే, మీ వైద్యుడి నుండి సలహా తీసుకోండి.